గజల్

సేద తీర్చే సాలభావము
సాయమడగదు తెలుసుకో!
వాడిపోయిన పూలకెన్నడు
తావి నిలువదు తెలుసుకో!!

నేల పొరలను చీల్చకుంటే
విత్తు మొలకలు ఎత్తునా
కాలవాహిని నీదకుంటే
భవిత బతకదు తెలుసుకో!

పరుల కోసం ఎడద తలుపులు
మూసి ఉంచడ మెందుకో
మనిషి మనసున మానవత్వం 
అంకురించదు తెలుసుకో!

పాకులాడకు వెర్రి కలలకు
శక్తి మించిన ఆశతో
నిన్ను నువ్వే ఎరగకుంటే
శాంతి  నిలువదు తెలుసుకో!
 
గుండె లోతులు తాకకుంటే
గజలు కాదది తెలుసుకో!
ప్రేమ పంచే శ్రీకు పలుకే
బదులు అడగదు తెలుసుకో!

మిత్రమా!!

 

గుండెలో తడి కన్నులోనీరారనీయకు మిత్రమా
ఎదిగినా నీ చూపు కిందకి జార మరువకు మిత్రమా!!

వెలుగు కిరణం అంకురించదు చీకటిని తొలగించుకుంటే
మనసుకంటిన మకిలి పొర కడిగేసుకో నువు మిత్రమా!!

కలల కలువలు విచ్చుకోవా స్ఫూర్తి వెన్నెల పరుచుకుంటే
ఒకో మజిలీ దాటుకుంటూ సాగిపో నువు మిత్రమా!!

విత్తనం మొలకెత్తుతుందా భూమి పొరలను చీల్చకుంటే
కాలవాహినినీదకుంటే భవిత బతకదు మిత్రమా!!

"శ్రీ"కలానికి పదునుపోదా గుండె లోతులు తాకకుంటే
మనసు మోడై పోకముందే కరిగిపో నువు మిత్రమా!!

రామ సుందరం


దశదిశలు నీవంటి దశావతారా
దశకంఠ సంహార దశరథ కుమారా

ఎన్ని యాగములు సల్పితే కలుగునీ కొమరుడు
ఎన్ని నోములు నోచిన దొరుకునీ మగడు
ఎన్ని పుణ్యముల ఫలితమీ పాలకుడు
               ముక్కోటి దేవతల రూపు శ్రీరాముడు            

నిత్య శోభనము నీ రూప వీక్షణము
నిత్య మంగళము నీ నామ శాబ్ధికము
ముక్తి దాయకము నీ పాద స్పర్శనము
                  శ్రీకాంత నుత నీకు ఆత్మ వందనము                  

సామవేదం

నీ పతనం షష్టిపూర్తి జరుపుకుంటోంది
నీ రాతని అరవై ఏళ్ళనాడు ఎవరు రాసారో
పేరుకే మిగిలిపోయిన
అగ్రకుల అహంకారీ
ఇంకా నిన్ను ఆడిపోసుకోవడానికి 
పురాణాల బూజులు దులుపుతున్నారు
ఎప్పుడో నువ్వు బలిని
మూడో పాదంతో అణిచావట
నేడు వేలకొద్దీ రిజర్వుడ్ పాదాలు నిన్ను నొక్కిపెడ్తున్నాయి
ఎప్పుడో నువ్వు ఏకలవ్యుడి వేలు కోరావని
నీ గొంతు నరకడానికి ఓ ఆయుధాన్ని పట్టుకున్నారు
చదవడానికి, చదివించడానికీ
ఏవుంది నీకిక్కడ.
నేతిబీరకాయలో నెయ్యుంటుందా
గౌరవాల భ్రమలు కప్పుకున్న అశావాదీ..
భవిషత్తు దిశ మేధస్సు వైపే
గొంతు సంకెళ్ళను తెంచుకున్న
నీ "అఖండగళం" "సామవేదం"లా మ్రోగనీ
 భవిష్యత్ ని ఏలనీ..

మానవ్యగీతం

మానవ్య గీతం


విశ్వ వేదిక మీద
హృదయ వేణువుపై
భవిత పలికించాలి
మానవ్యగీతం
విశ్వాన ఎగరాలి
శాంతిఃకపోతం

నన్ను ఎదిగేలా చేయండి

నన్ను ఎదిగేలా చేయండి
 ఎక్కడ్రా బాబూ వెతికేది
ఎలా కనబడకుండా పోయింది
 ఏ గుల్మాల మధ్య
 వాల్మీకం లో దాగింది
 ఎన్ని అకృత్యాలకు
  ప్రకృతి విలయతాండవాలకు
  ఎన్ని విజయాలకు
  వినాశనాలకు
  అది
  సాక్షి
  నిత్య విహార పక్షి
           ఎలా కనబడకుండా పోయింది......
     నాకేనా ఇలా???
  నీడ శిబిరాల్లో
  నా వొళ్ళు నేనే కప్పుకొని
  బిగదీసుకుని..
 పారేసిన ఎంగిలి ఆకుల్ని
 కుక్కల్తో పాటు పోట్లాడి
 తెచ్చుకొని
 గుడి మెట్ల మీద చేతులు
 చాపుకుని
 అస్థిత్వాన్ని అరువు పెట్టి...
 వెతుకుతూనే ఉన్నాను
 కదుపుతూనే ఉన్నాను
 అది
 ఆగిపోయినట్లుంది
నా కాలం
కనబడకుండా పోయింది
మీకు గానీ కనబడితే
కాస్త చెప్పండి
మార్పు చూపే భవిష్యత్ వైపు
నన్ను తీసుకుపొమ్మని
ఈ అనాధ ని
మోసుకు పొమ్మని
గట్టి మట్టి పెళ్ళల కింద
నొక్కిపెట్టేసిన విత్తుని
కనీసం ఒకరైనా
కన్నీటి చుక్క రాల్చి
వదులు చేయండి
నా కాలాన్ని
  కదిలేలా...తిరిగేలా.. చేయండి
  నన్ను ఎదిగేలా చేయండి.

అంకురం

అంకురం


అలా చూడకు నేస్తం
నీ నిశ్శబ్ధ ప్రశ్నా శరః పరంపరనోపలేను
మత విద్వేషాలతో రగులుతున్న
అవని అస్థిత్వాన్ని
ఏ కన్నులతో చూడగలిగాను
ఉగ్ర విస్ఫోటనాలతో నేలకూలుతున్న శాంతి కపోతాన్ని
ఏ మందు పూసి కాపాడుకున్నాను......
విన్నావా ఆ అనాధ నీరవ గళనాదం
అపశృతులు పలుకుతోంది నిఖిల ప్రేమగాత్రం
మాటల్లో కదలు కనలు గుండెల్లో ఆక్రోశం
అడుగు ముందుకేయమంటే నాకేమను అలసత్వం.
నేను
శయ్యా సుఖుడ్ని
కార్య విముఖుడ్ని
కోరికల సౌధంలో కలలకు బందీని
ఏం చెప్పగలను నేస్తం
నీ ప్రశ్నా సంధానానికి
నా జడ హృదయ కవాటాలు పగిలిపోవాలి
నీ అంతర్మధ నానికి
నా మనఃసంద్రంలో చైతన్యప్రభవ అంకురించాలి.
తమస్సు కమ్మిన
నిరాశ హృదయం
ఉషోదయంతో లేవాలి
ఆశయాలతో ఎదగాలి
ఇప్పుడు అడుగు నేస్తం
నీ నిశ్శబ్ధ గళం
స్వచ్ఛంగా వినబడుతోంది....
ఈ గళం యుగళమై
వేలవేలకు చేరి
చైతన్య వీచికలు పారాలి..
నీ శై శవం వెచ్చగా, పచ్చగా ఉండేలా
స్వేఛ్చగా, స్వచ్ఛంగా ఉండేలా.....
ప్రకృతి పరుచుకోవాలి.
మార్పు సంతరించుకోవాలి
అప్పుడే
ప్రేమ విరబూస్తుంది
అవని పులకరిస్తుంది.