అంకురం

అంకురం


అలా చూడకు నేస్తం
నీ నిశ్శబ్ధ ప్రశ్నా శరః పరంపరనోపలేను
మత విద్వేషాలతో రగులుతున్న
అవని అస్థిత్వాన్ని
ఏ కన్నులతో చూడగలిగాను
ఉగ్ర విస్ఫోటనాలతో నేలకూలుతున్న శాంతి కపోతాన్ని
ఏ మందు పూసి కాపాడుకున్నాను......
విన్నావా ఆ అనాధ నీరవ గళనాదం
అపశృతులు పలుకుతోంది నిఖిల ప్రేమగాత్రం
మాటల్లో కదలు కనలు గుండెల్లో ఆక్రోశం
అడుగు ముందుకేయమంటే నాకేమను అలసత్వం.
నేను
శయ్యా సుఖుడ్ని
కార్య విముఖుడ్ని
కోరికల సౌధంలో కలలకు బందీని
ఏం చెప్పగలను నేస్తం
నీ ప్రశ్నా సంధానానికి
నా జడ హృదయ కవాటాలు పగిలిపోవాలి
నీ అంతర్మధ నానికి
నా మనఃసంద్రంలో చైతన్యప్రభవ అంకురించాలి.
తమస్సు కమ్మిన
నిరాశ హృదయం
ఉషోదయంతో లేవాలి
ఆశయాలతో ఎదగాలి
ఇప్పుడు అడుగు నేస్తం
నీ నిశ్శబ్ధ గళం
స్వచ్ఛంగా వినబడుతోంది....
ఈ గళం యుగళమై
వేలవేలకు చేరి
చైతన్య వీచికలు పారాలి..
నీ శై శవం వెచ్చగా, పచ్చగా ఉండేలా
స్వేఛ్చగా, స్వచ్ఛంగా ఉండేలా.....
ప్రకృతి పరుచుకోవాలి.
మార్పు సంతరించుకోవాలి
అప్పుడే
ప్రేమ విరబూస్తుంది
అవని పులకరిస్తుంది.

1 కామెంట్‌: