అహంభో అభివాదయేత్

అహంభో అభివాదయే

            నా శ్రధ్ధకి ప్రేరణ మా అమ్మమ్మ, నాన్నమ్మ గారి కథలు...తర్వాత చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర, బుజ్జాయి పుస్తకాలు. ఇలా మొదలై, నా సాహితీ పఠనం... మెల్లగా మధుబాబు’షాడో’,   పానుగంటి’బుల్లెట్’ ల వైపు మళ్ళి, యండమూరి,, మల్లాది ల వైపు తిరిగింది.      తులసీదళం, అష్టావక్ర, వెన్నెల్లో ఆడపిల్ల, దుప్పట్లో మిన్నాగు, సావిరహే, మందాకిని, అందమైన జీవితం ఒకటేమిటి.... ఇచ్చాపురం లో అద్దె షాపు లో దొరికిన ప్రతీ పుస్తకాన్ని వదలకుండా చదివేవాళ్ళం(నేను,మా అక్క).

శ్రీశ్రీ మహాప్రస్థానం, అబ్బూరి వారి కవన కుతూహలం, తిలక్ అమృతం కురిసిన రాత్రి చదివిన తర్వాత రూట్ మారింది.      ఇంక నండూరి, ఆరుద్ర, రంగనాయకమ్మ, చలం వీళ్ళ పుస్తకాల వెనకే తిరిగాం. అప్పట్లో గ్రూప్ వన్ లో తెలుగు ఆప్షనల్ గా ఎంచుకున్న తర్వాత సెలక్షన్ రాకపోయినా తెలుగు సాహిత్యం మీద మరింత ఇష్టం పెరిగింది. నన్నయ, పోతన, శ్రీనాధుడు, పింగళి సూరన కూడా నచ్చడం మొదలుపెట్టారు.
అమరావతి కథలు, పసలపూడి కథలు, ఇల్లేరమ్మ కథలు ఇవీ, అవీ కావు..ఇన్నీ అన్నీ కావు. చేతిలో పుస్తకం లేకుండా నోట్లో ముద్ద దిగేది కాదు ( ఇల్లా తింటే వంటబట్టదురా వెధవా అని అమ్మ తిట్టినా సరే అదే తంతు)
అక్కడితో ఆగితే బాగుండేదని మా అన్నయ్య అంటుండేవాడు. రాయడం కూడా మొదలుపెట్టా. అప్పట్నుంచీ చూస్కో నా సామిరంగా..... ఇంట్లో వాళ్ళు ఎంత బిజీగా వున్నా, వద్దురాబాబూ అన్నా, నెత్తి మొత్తుకున్నా వదలలేదు. రాస్తూనే వున్నా.. వాళ్ళ నెత్తిన కొడుతూనే ఉన్నా. వాళ్ళే నా ప్రథమ శ్రోతలు.  ఇప్పుడు మీ వంతు.ముందే క్షమాపణలు కోరుకుంటున్నా గాబట్టి నన్ను మీరు భరించాల్సిందే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి