భామాకలాపం



"ఏ ఘడియ తీరేను ఈ మావ దిగులంత
ఏ ఝాము చేరేను ఈ భామ నా చెంత
ఏ జంట మురిసేను ఈ రేయి అంతా
"







కనికరించేనా....
అయ్యబాబోయ్ అని చిత్తరువు మాదిరి
ఆశ్చర్యపడిపోయి మతిపోయి ఉంటాను
అంతలేసీ కళ్ళు ఎటువైపు చూస్తాయొ
ఆ వైపు పరుగెత్తి ఆడ నించుంటాను

పరవళ్ళు తొక్కేటి పడుచు యమునైతేటి
పారిజాతామేటి సంపెంగి పువ్వేటి
పున్నమే నా భామ నవ్వుతుంటేను
పూలన్ని ఈసుతో భామనే చూసేను

భామకందేననీ సూరీడుకి చెప్పనా
మేఘాలతో నేను గొడుగేసి పట్టనా
తారలన్నీకోసి మాలేసి కట్టనా
నా మనసు చూసేన భామ ఎపుడైనా

గుండె గుడిలో నిన్ను కొలువెట్టుకున్నాను
కలల కలువలతోటి పూజచేస్తున్నాను
కనికరించీ భామ కన్నుకొట్టేనా
రేయిపవలూ మాకు ఏకమయ్యేనా 


అలక

మంచు ముత్యం తోడ పిల్ల తెమ్మెర ఒకటి
మావ అడుగుల కబురు ఊదుతూ పోయింది

సన్న కాలువ కాడ మొగలి పొదలా నీడ
తీపి గురుతొకటి నా మదిన మెదిలింది

నిరుడుదాకా కురిసి కన్నీరు ఇంకినా
మావ కౌగిలి మెదిలి మేను పులకించింది

కొంటె కోయిల ఒకటి గలగలల ఏరొకటి
ఇటు చూపి అటు చూపి మావ మావంటాయి

మంచు ముత్యం తోడ పిల్ల తెమ్మెర ఒకటి
మావ అడుగుల కబురు ఊదుతూ పోయింది

మనసేమొ నా మావ రాక సూడంగానె
ఎన్నాళ్ళ విరహమో ’అలక’ మొదలయ్యింది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి