కళ్యాణమ్





శ్రీ సీతారాముల కళ్యాణం
శ్రీకాంతునిచే శ్రీకారం
జ్ఞానమోక్షాల సారం
మనఃసిరికి నవ కోణం

ప్రణవంబునర్పింతు
కళ్యాణ కారకా
పాహిరామ ప్రభో
సర్వసుఖదాయకా

అసురబాధలకు తాళని మునులు
అమరావతిలో ఇంద్రుడు చంద్రులు
ఏతెంచిరదే  హరి చరణానికి
ఏమౌనో ఇక అసుర గణానికి

హరినామమునే శరణుగ నమ్మిన
అస్మదీయులను పరిరక్షింపగ
శంఖును చక్రిని వాసుకి తోడను
బయలుదేరె హరి భూమార్గానికి

పతివిరహానికి తాళని శ్రీ సతి
స్పృశించె పృధ్విని మిథిలపురమ్మున
అవిఘ్నమస్తూ శుభమస్తూ ఇక
సకలజనులకూ మంగళమస్తూ

అయోధ్య పాలకుడా దశరధుడు
పుత్ర భిక్షకై చేసెను యాగం
ముగ్గురతివలకు మగడా తిలకుడు
దశరధుడెరుగడు ఫలమా హరియని

యాగపానమును పొందిన కొమ్మలు
చిగిర్చి ఇచ్చిరి ఆ నలుగురిని
నీలమేఘ శ్రీరామ భరతులు
పసిడి ఛాయ లక్ష్మణ శతృఘ్నులు

మిథిలాపురమున కృషిఃఫలమ్ముగ
వసుధ యొసంగెను సీతని వరముగ
రూపలావణ్యమున పోల్చదగునవి లేవు
జనకు పుత్రికయామె నామమిడె సీతయని

అచ్చట రాముడు ఇచటనె జానకి
శోభనమే ఇక జగమునకు
రవికుల తిలకుని పాదధూళితో
విరిసె కురిసె పూలూ నీలాలు

అయోధ్యనందున పెరిగె రాముడు
భ్రాతృ ప్రేమికులు ఆ సోదరులు
నేర్చిరానల్గురున్ అస్త్రశస్త్రాదులను
జ్ఞాన సారంబులను వశిష్ఠుని చెంతను

అచ్చటన్ మిథిలలో భాసిల్లె శివధనువు
సాధ్యమా ఎవరికిని ధరియింప సంధింప
ఆటలో పూబంతి విల్లు క్రిందను దాగ
శివుని సోదరి గాన జరిపెనా ధనువుని




జనకుడది పరికించి పుత్రికళ్యాణమునకు
ఘడియయని తలపించి విడిచెనొక ప్రకటనము
శివధనువు సంధించు వీరుడెవ్వడు గాని
ఇంతి సీతను పొంద జామాత పదవొంద

శ్రీరామ లీలలను జగమునకు తెలుపంగ
యాగ రక్షణ పేర ఏతెంచె రాజర్షి
పుత్ర వాత్సల్యము మనమునందుండగా
దుఃఖమో మోహమో రాజు గుండెను దాగె

బ్రహ్మర్షి మాటలను జవదాటలేకనో
రామ లక్ష్మణలులనంపె రాజర్షి చెంతకు
భక్తితోడను వారు వందనంబొనరించి
విశ్వమిత్రుని తోడ అడవులకు అరుదెంచె


శ్రీరాముని అవతారం
ఆదర్శాలకు మణిహారం
శ్రీరాముని అవతారం
అసురుల తృంచే కరవాలం



శ్రీరామ శక్తికిని తోడయ్యె అతిబల
మహాబల విద్యలున్ అస్త్ర శస్త్రాదులున్
అగ్రజుని వెంటగల లక్ష్మణుకి గూడ
ఒసగె ఆ రాజర్షి ఆ సకల విద్యలున్

విశ్వ మిత్రుని యాగ ప్రాంగణమునకు జేరె
యాగరక్షణ దక్ష భుజస్కందముల మోయ
మారీచ సుబాహులనబడే అసురులని
యెదిరించి జయులయ్యె నారామ లక్ష్మణులు



యజ్ఞఘట్టము పిదప యిరువురిని దీవించి
మిధిలకున్ గొనిపోయె స్వయంవరమచ్చటనె
ఆ మధ్య మార్గమున రామపాదము తాకి
శిలమారె లలనగా ఆమె గౌతమ పత్ని

పట్టు బంగరు చీర నిండు కుంకుమబొట్టు
అలరారు పడతిలా మిథిలపురి సోయగం
నిండైన తోరణం స్వాగతం పలుకంగ
అడుగిడెను శ్రీరాముడాజనక నగరమున

దారంత సంబరం జనుల కోలాహలం
ఆనంద వీచికలు గలగలా పారగా
అంతఃపురమునుంచి ఓరకంటను సీత
సుందరాంగుని గాంచి కెంపుమొగ్గయ్యింది

అతడేమొ నా సఖుడు శిరుత నవ్వులవాడు
శివధనువునెత్తి నా మనసునేలేవాడు
మనసులో కోరికలు మన్మధుని వీచికలు
మదిని కలవరపరచ సిగ్గుపడెనా సీత

స్వయంవరమారోజే సీతను వరింపగా
సభమండపముమధ్య నుంచబడె నా విల్లు
లేత రాకొమరులు రాజాధిరాజులు
అతిబలమహాబలులు ఏతెంచెరాశతో

ఢమఢమ జ్వలిత పటు భయరవమ్మెచటిది
దశకంఠుడేతెంచె అహము మనమున నిండ
హిమపర్వతముకన్న శివచాపమే బరువో
భంగపడి రావణుడు వెనుదిరిగె లంకకున్

అడుగడుగొ ఆ రాజు అకట విఫలమాయె
రారాజె నిచ్చెలీ ఆశ సుధము హూలె
వీరాధివీరులు రాజమార్తాండులు
ఒక్కరైనను లేర ధనువు సంధింపగా

చిరునవ్వులలరారు లేత దశరధపుత్రు
డారామ చంద్రుడు లేచెనది సంధింప
విశ్వ మిత్రులవారి పాదపద్మము తాకి
పిదప శివధనసుకున్ వందనంబొనరించె


కనులు తుమ్మెదలాగు అదరగా బెదరగా
అదిరేటి అధరములు కస్తూరి నిండగా
ముక్కోటి దేవతల ప్రార్థించె మనమునన్
మిథిలపురి యువరాణి రాము విజయము గూర్చి

నారదుని తుంబురుని గాన దీవెన బొంది
కిన్నెరల కింపురుష పూవానలో తడిసి
సకలలోక ప్రజల మనమునందుని నిలచి
ఒంటి వ్రేలిని ధనువు సంచించి విరిచెను

ఉవ్వెత్తునన్ యెగసె కరతాళ  ధ్వానములు
సుమ వర్షమున్ గురిసె దివినుండి ఇహమునకు
సీత సిగ్గును చూసి కెంపు చినబోయింది
జనకు కనులను నిండె ఆనంద భాష్పములు

నెలవంక వెలుగుకే కందేటి ఆ లామ
కరమునన్ పూమాల ధరియించి వచ్చినది
మంగళ వాద్యములు మిన్నుతాకంగాను
శ్రీరామ శంఖువుని అలరె పరిమళమాల

శుభవార్త యెరిగి ఆ అయోధ్య పురమునన్
పురజనుల మనమునను సంతసము నిండినది
వరుడు శ్రీరాముడే నవ వధువు సీతయే
కరగ్రహణ శుభ తరుణమాసన్నమైనది

భువి పెండ్లి పీటయై ఆకసము ఛత్రమై
రామ లక్ష్మణ భరత శతృఘ్నులకు
మంగళ ధ్వనులతో వేదమంత్రాలతో
కళ్యాణము జరిగె శాంతి శాంతిశ్శాంతి


కళ్యాణ రాముడు తనబిడ్డ కరమంద
భూమాత ఆనంద పారవశ్యము జెంద
కన్నవారీ కనుల కరువు తీరేలే
వినిరెవ్వరీ చరిత వీనులకు విందులే

ఈ వేడుకన్ కాన వేకనులు చాలవులె
శ్రీరాము సీతకున్ శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు జనులు యెల్లరికీ
నిత్యమూ మంగళము లోకమంతటికీ

ప్రణవంబు నర్పింతు కళ్యాణ కారకా
పాహిరామ ప్రభో సర్వ సుఖ దాయకా
స్వర్గ సుఖముల కన్న నీ నామమీ సుఖము
అమృతము కన్నను నీ పిలుపు మధురము



(వేంకటేశ్వరాంకితం)

-ఛందోలంకారవ్యాకరణాదులు ఇందు లేకపోయినా రామునిపై  గల అచంచలమైన భక్తి విశ్వాసాలు  ఈ కళ్యాణానికి నాంది పలికాయి - శ్రీకాంత్




మార్గమధ్యమునందు కారు మేఘము క్రమ్మ
ఫెళఫెళ ధ్వనులతో ఉరుము ఉరమంగా
భీభత్స ప్రళయమా తాటక మాయనియెంచి
మౌని ఆజ్ఞను పొంది వధియించె రాముడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి