అనువాదాలు

 మహాప్రస్థానం
(10th class English Text bookలో కృష్ణపక్షం చదివిన ప్రేరణతో 'Because I Couldn't stop for death కవితకి నా అనువాద ప్రయత్నం)

ఎపుడు వచ్చునో కాని యెదురు చూపులు లేవు
ప్రాణ సఖుడే పంపె పల్లకీ నా కొరకు ఎటు
ల కాదందు ఆతని కోరికలను......

యెవరహో బలకరింతురెచట కనులకు రారు ది
శ పాలకుల్వోలె ’ఓహో’ యనెడి బోయవాండ్రు
శాశ్వతత్వము వైపు సాగనంపు...

చంచలమ్మై అలరు కోరికలు నెరచేటి నిదు
రమెలకువలన్ని సఖునికై కాన్కబట్టి కదిలె
రాతిరి పవల నుంచి ప్రణయ రధము....

సంధ్య వెలుగుల గాఢ పరిష్వంగ తరళ ఊపి
రుల స్పర్శనుంచి విరహమున్ రగులు చీకట్ల
వైపు కదిలె పల్లకీ సఖుని కడకు.......

అల ప్రణయ సౌధమ్ము నిశీధి ముసుగులో వెలుగు
దివ్వెలాభరణముల మ్రోసెడి విరహతాపము గ
ని ముంగిట నిలిచె మా విరుల రథము.


 ఎలా ప్రేమించను నిన్ను??
(ఎలిజబెత్ బేరెట్ బ్రౌనింగ్  రాసిన 'How do I love thee - let me count the ways' కవితకి  నా భావానువాద 
 ప్రయత్నం)


ఎలా ప్రేమించను నిన్ను దారుల్ని వెతకనీ..
మనసుతోనా.. మేనితోనా...
నాలో ప్రతి అణువు తోనా
విశ్వాంతరాళ లోతుల్నుంచా
అంబరాన్ని మించిన ఎత్తునుంచా..
ఎలా ప్రేమించను నిన్ను
వెన్నెలా..... అలా...ఏటి గలగలా...వసంతంలా..
ఉదయభానుని కిరణాల్లా
ఎలా ప్రేమించను నిన్ను

అమ్మా అనే పసివాడి పిలుపులాగా
యౌవనంలో అల్లుకున్న కలల పూల హారంలాగా
వృద్ధాప్యపు జ్ఞాపకాల శిధిలాల్లాగా
ఎలా ప్రేమించను నిన్ను

ప్రేమించడం ప్రతిరోజూ నాకు అలవాటుగా మారిపోయింది
ప్రేమిస్తాను నిన్ను
నిన్నా... నేడు.... రేపు
వరమిస్తే, మరణం తర్వాత కూడా ప్రేమిస్తాను
నీ జ్ఞాపకాల్ని మరుజన్మలోనూ
మోయడానికి సిద్ధంగా ఉన్నాను
ఇంకా చెప్పు వెలితిగా ఉంది
ఎలా ప్రేమించను నిన్ను??

1 కామెంట్‌: